షుగరు వ్యాధికి మరియు గుండె జబ్బుకి చాలా అవినాభావ సంబంధం ఉంది.
షుగరు వ్యాధి ఉన్నవారిలో 65 శాతం మంది చావుకి కారణం గుండె జబ్బు మరియు 30 నుంచి 40 శాతం గుండె మరియు ధమని సంబంధ జబ్బులకు కారణం షుగరు వ్యాధి.
షుగరు వ్యాధి గుండె జబ్బుని కలగజేయు విధానము
షుగరు వ్యాధి వున్న వారిలో దాదాపు 60 శాతం మందికి అధిక రక్తపోటు, దాదాపు అందరిలో అధిక కొలెస్ట్రాల్, చాలా మందిలో స్థూలకాయం వంటి ఇతర గుండె మరియు ఇతర ధమన సంబంధ వ్యాధుల ప్రమాద కారకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలకలసి ఉండడం వల్ల వీరిలో అధికంగా గుండె జబ్బు వస్తుంది.
షుగరు వ్యాధి దానంతట అదే కూడా ఎన్నో ప్రక్రియల ద్వారా రక్త నాళాలను, నరాలను దెబ్బతీసి దాని ద్వారా అధికంగా గుండె జబ్బు మరియు ఇతర ధమన సంబంధ వ్యాధులను కలుగజేస్తుంది.
గుండె జబ్బుపై షుగరు వ్యాధి యొక్క ప్రభావము
- షుగరు వ్యాధి ఉన్న వారికి లేని వారితో పోలిస్తే 2-4 రెట్లు అధికంగా గుండెపోటు వస్తుంది మరియు తక్కువ వయసులోనే వస్తుంది.
- యువతుల్లో కూడా ఎక్కువ వస్తుంది.
- గుండెపోటులో లక్షణాలు లేకపోవడం లేదా భిన్నంగా ఉండడం అనేది షుగరు లేని వాళ్ళలో 6-15 % ఉంటే, ఉన్న వారిలో 32-42% ఉంటుంది. దీని వల్ల గుండెపోటుని పసిగట్టలేక పోవడం, చికిత్సలో ఆలస్యం వంటివి ఎక్కువగా జరుగుతాయి.
- షుగరు వ్యాధి ఉన్నవారిలో గుండె పోటు వస్తే, అది సాధారణంగా కంటే తీవ్రంగా ఉంటుంది మరియు దానిలో వివిధ సమస్యలు కలుగుటకు మరియు చనిపోవుటకు అవకాశం అధికంగా ఉంటాయి మరియు వీరిలో చికిత్స (ఆంజియోప్లాస్టి, బైపాస్ ఆపరేషన్, మందులు) యొక్క ఫలితాలు కూడా షుగరు లేనివారిలో కన్నా తక్కువగా ఉంటాయి.
- షుగరు వ్యాధి ఉన్నవారిలో మగవారిలో రెండు రెట్లు మరియు ఆడవారిలో ఐదు రెట్లు అధికంగా గుండె సోలిపోవుటకు (Heart Failure) అవకాశం ఉంది. అది గుండెపోటు మరియు గుండె ధమన వ్యాధి వల్ల గుండె కండరం దెబ్బ తినడం మరియు షుగరు వల్ల నేరుగా గుండె కండరం దెబ్బ తినడం వల్ల జరుగుతుంది.
కొన్ని ఇతర సమస్యలు
- పెద్దవారిలో అంధత్వానికి షుగరు వ్యాధి ప్రధాన కారణం.
- మూత్ర పిండాల వైఫల్యానికి ప్రధాన కారణం కూడా షుగరు వ్యాధే (40%)
- షుగరు వ్యాధి ఉన్న వారిలో 60-70% మందిలో తేలిక పాటు నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఎంతో కొంత నాడీ వ్యవస్థ సంబంధ సమస్యలు ఉంటాయి.
- 60% ప్రమాదేతర కాళ్ల గాంగ్రీన్ మరియు విచ్చేదన శస్త్ర చికిత్సకు కారణం షుగరు వ్యాధి
- షుగరు వ్యాధి వల్ల కలుగు సమస్యలను తగ్గించుటకు పాటించవలసిన పద్దతులు
- రక్తంలో షుగరుని నియంత్రణలో ఉంచుకోవాలి. (HbAC<7; FBS < 130mg %, PPBS < 180 mg %) ఆ రక్తంపోటుని నియంత్రణలో ఉంచుకోవాలి. (BP < 130/80 mm of hg)
- రక్తలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుకోవాలి. (LDL < 70 mg/dl, HDL మగవారిలో 40 mg/dl మరియు ఆడవారిలో >50 mg/dl. Triglycerides<150 mg/dl)
- పోగత్రాగుట పూర్తిగా మానేయాలి.
- మద్యపానం నియంత్రించుకోవాలి. (< 30 ml/day)
- శారీరకంగా హుషారుగా ఉండాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- బరువుని నియంత్రించుకోవాలి.
- BMI= బరువు (కేజిల్లో) /ఎత్తు (మీటర్లలో) = 18 నుంచి 23 లోపు ఉండాలి
- మరియు నడుము కొలత మగవారిలో 36 ఇంచిలు (90 సెం.మి.) కన్నా మరియు ఆడవారిలో 32 ఇంచిలు (80 సెం.మి) కన్నా తక్కువ ఉండాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
- డాక్టరు సూచనల మేరకు మందులు శ్రద్ధగా వేసుకోవాలి.
పై సూచనలను పాటించడం ద్వారా షుగరు వ్యాధి ఉన్నవారు వారి సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు