రుమాటిక్ జ్వరం మరియు రుమాటిక్ గుండె జబ్బు స్ట్రెప్టోకోకస్ అనే క్రిమి వల్ల కలుగు గొంతు ఇన్ఫెక్షన్ పర్యావసానంగా వచ్చే సమస్యలు, మన దేశంలో ప్రతి 1000 మంది పిల్లలలో 1-5 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

రుమాటిక్ జ్వరం :-

ఇది 5-15 సం|| ల వయస్సు పిల్లలకు వస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కపిల్లవాడికి సంవత్సరంలో ఒక్కసారైనా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. వీరిలో 15-20% మందికి ఇది స్ట్రెప్టోకోకస్ అనే క్రిమి వల్ల వస్తుంది. ఇలా స్ట్రెప్టోకోకస్ అనే క్రిమివల్ల గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో 0.3 నుండి 3% మందికి రుమాటిక్ జ్వరం వస్తుంది.

రుమాటిక్ జ్వరం యొక్క లక్షణాలు :-

రుమాటిక్ జ్వరం వచ్చిన 2 వారాలలో గుండెమీద ప్రభావం పడుతుంది. ఇది కనుక్కోలేనంత తక్కువ తీవ్రత నుంచి ప్రాణాపాయ పరిస్థితికాని, అత్సవసర గుండె శస్త్ర చికిత్స చేయవలసిన అవసరం కలిగేంత తీవ్రత వరకు ఉండవచ్చు. ఇది గుండెలోని అన్ని భాగాలని ముఖ్యగా కవాటాలని దెబ్బతీస్తుంది. దీని వల్ల 0.3 నుండి 1.6% మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతారు.

రుమాటిక్ జ్వరం వచ్చిన వాళ్ళందరికి కూడా 101 నుండి 102 ° ఎఫ్ దాకా జ్వరం వచ్చి కొద్దివారాల పాటు వుంటుంది. రుమాటిక్ జ్వరం వచ్చిన వారిలో కీళ్ళనొప్పులు సర్వసాధారణంగా వస్తాయి. ఇవి తక్కువ తీవ్రత నుంచి కదలలేనంత వరకు ఎంత తీవ్రతతోనైనా ఉండవచ్చు. 67% మందికి కీళ్ళవాపులు కూడా వస్తాయి. ముఖ్యంగా మోకాలు, మడమ, మోచేయి లాంటి పెద్ద కీళ్ళు ఒకదాని తరువాత మరొకటి ప్రభావితం అవుతాయి. ఈ కీళ్ళ వాపులు, నొప్పులు సాధారణంగా నెలరోజులు మించవు మరియు కీళ్ళకు సంబంధించి ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తవు.

రుమాటిక్ జ్వరం వచ్చిన వారిలో 20% మందికి ఖోరియా అనే నరాల సమస్య వస్తుంది. వీరికి భావోద్రేకము కలగటం, చేసేపనులలో సమన్వయ లోపము వుండటం, కాళ్ళు, చేతులు, ముఖములో అసంకల్పిత కదలికలు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. రుమాటిక్ జ్వరం వచ్చిన వారిలో 3% మందికి చర్మం కింద కణితలు వంటివి ఏర్పడటం, 2% మందిలో చర్మం మీద మచ్చలు ఏర్పడటం జరుగుతుంది. మరి కొందరిలో ముక్కు నుంచి రక్తం కారడం, కడుపునొప్పి రావడం వంటి సమస్యలు వస్తాయి.

రుమాటిక్ జ్వరానికి అతి ముఖ్యమైన చికిత్స పెనిసిలిన్. అంతేకాక మరల ఈ వ్యాధి రాకుండా ఉండడానికి కూడా 21 రోజులకు ఒకసారి పెనిసిలిన సూది వేసుకోవాలి.

దీర్ఘకాలిక రుమాటిక్ గుండె జబ్బు

దీర్ఘకాలిక రుమాటిక్ గుండె జబ్బు రుమాటిక్ జ్వరం యొక్క పర్యావసానంగా గుండె కవాటాలు దెబ్బతినటం వల్ల వచ్చు సమస్య రుమాటిక్ జ్వరం వచ్చిన తరువాత ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొందరికి కేవలం 3-5 సంవత్సరాలలో నుంచి పాశ్చాత్య దేశాలలో 20-40 సంవత్సరాల వరకు కాల పరిమితి తరువాత వస్తుంది.

మైట్రల్ స్టినోసిస్ :-

ఇది ఎడమ కర్ణిక, జఠరికల మధ్య వున్న ద్విపత్ర కవాటం యొక్క కన్నము కుదించుకుపోవటము (ఎడమ రెండు గుండె గదుల మధ్యనున్న కవాటము సన్నబడడము) దీని వల్ల ఎడమ కర్ణికలో (Left Atrium) ఒత్తిడి ఎక్కువై దాని వల్ల ఊపిరితిత్తులలో రక్తచలన దోషం వల్ల ఆయాసం, ఎడమ కర్ణిక పెద్దదవడం, కర్ణిక దడ, దాని వల్ల గుండెలో రక్తపు గడ్డలు ఏర్పడి అవి స్థానభ్రంశం చెంది వివిధ అవయవాల రక్త సరఫరాకి అడ్డుపడటం (Cardio embolism) పుపుసధమని సంబంధ రక్తపోటు (pulmonary arterial Hypertention) మొదలగు సమస్యలు వస్తాయి. వీరికి మందులతో పాటు ద్విపత్ర కవాటచ్చేదన ప్రక్రియ (Ballon Mitral Valvotomy) కాని కవాట మార్పిడి శస్త్ర చికిత్సగాని అవసరం అవుతుంది. చికిత్స చేయని వారిలో పది సంవత్సరాల కాలంలో కేవలం 0-15% మంది మాత్రమే జీవించి వుంటారు. పుపుస ధమని సంబంధ రక్తపోటు అధికంగా వున్నవాళ్ళు చికిత్స లేనిచో సగటున మూడు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి.

మైట్రల్ రీ గర్జిటేషన్ :-

ఎడమ జఠరికకు, ఎడమ కర్ణికకు మధ్య నుండు ద్విపత్ర కవాటము దెబ్బతినడం వల్ల హృదయ సంకోచ సమయమున ఎడమ జఠరిక నుంచి ఎడమ కర్ణికకు రక్తం ప్రత్యావహనము అవడాన్ని మైట్రల్ రీగర్జిటేషన్ అంటారు. (ఎడమ క్రింది గది నుంచి పై గదికి రక్తం లీకేజ్ అవడం) దీనివల్ల ఎడమ గుండె గదులు పెద్దవిగా అవడం, తరువాత ఎడమ జఠరిక బలహీన పడటం జరగవచ్చు. ప్రత్యావహనము (కవాటం లీకేజ్) తీవ్రంగా ఉన్నవారిలో ఏ లక్షణాలు లేని మరియు జఠరిక పనితీరు సక్రమంగా ఉన్నవారిలో కూడా 6 నుంచి 10 సం||ల కాలంలో లక్షణాలు కాని, జరరిక బలహీనతకాని కవాట మార్పిడి శస్త్రచికిత్స అవసరం కాని వస్తాయి. వీరిలో జరరిక బలహీనతకాని, లక్షణాలు కాని ఉన్నట్టయితే 10 సం|| లలో 90% మందికి కవాట మార్పిడి శస్త్ర చికిత్స కాని లేదా చనిపోవటం కాని జరుగుతుంది.

అయోర్టిక్ స్టినోసిస్ :-

ఇది ఎడమ జఠరికకు, బృహద్ధమనికి మధ్యనున్న కవాటం సన్నబడటం (Left Ventricle కి Aorta కి మధ్యనున్న కవాటం సన్నబడటం) దీనివల్ల ఎడమ జఠరిక మీద ఒత్తిడి ఎక్కువై మెదట మందం కావడం, తరువాత బలహీనపడటం జరుగుతుంది. ఒక్కసారి లక్షణాలు ( ఛాతి నొప్పి, ఆయాసం, సొమ్మసిల్లడం) మొదలైతే, కవాట మర్పిడి శస్త్ర చికిత్స చేయించుకోకపోతే సగటున 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు.

అయోర్టిక్ రీగర్జిటేషన్ :-

ఇది గుండె వ్యాకోచించే సమయంలో రక్తం బృహద్ధమని నుంచి ఎడమ జఠరికకు ప్రత్యావహనం కావడం ( బృహద్ధమని
నుంచి ఎడమ క్రింది గుండె గదికి రక్తం లీకేజ్ కావడం) దీని వల్ల ఎడమ జఠరిక (Left ventricle) మీద ఒత్తిడి పెరిగి ఎడమ జఠరిక నుందం కావడం మరియు పెద్దదిగా అవడం చివరికి బలహీనపడటం జరుగుతుంది. ఒకసారి ఛాతినొప్పి, ఆయాసం లాంటి లక్షణాలు మెదలైతే వీరిలో కవాట మార్పిడి శస్త్ర చికిత్స చేయనిచో సంవత్సరానికి 10 నుంచి 20% మందికి ప్రాణహని ఉంటుంది.

రుమాటిక్ గుండె జబ్బు వున్నవారిలో కొందరికి కుడి ప్రక్కకవాటాలు కూడా దెబ్బతిని దీనివల్ల కూడా అనేక సమస్యలు రావచ్చు. పై వివరించిన సమస్యలే కాక గుండె కండరము మీద ప్రభావం వల్ల గుండె కండరం బలహీనపడటం లేదా గుండెలో ఇన్ఫెక్షన్ రావడం మొదలగు ఎన్నో సమస్యలు రావచ్చు.

అంతేకాక ఒక వ్యక్తిలో అనేక కవాటాలు వివిధ రకాలుగా ప్రభావితం కావచ్చు కనుక ఈ రుమాటిక్ గుండెజబ్బు అనూహ్యమైన రీతుల్లో వ్యవహరించవచ్చు. రుమాటిక్ గుండె జబ్బు ఉన్నవారికి జీవితాంతం పెనిసిలిన్ అవసరం అవుతుంది. వీరిలో చాలామందికి మందులతో పాటు గుండె కవాటాల మరమత్తు లేదా మార్పిడి శస్త్ర చికిత్స అవసరం అవుతుంది.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *