ఛాతినొప్పి కలగడానికి ఎన్నో కారణాలున్నాయి. ఛాతి నొప్పి ఉన్నవారిలో 15% నుంచి 25% మందికి మాత్రమే అది గుండెకు రక్త సరఫరా తగ్గడం వల్ల లేదా గుండెపోటు వల్ల వస్తుంది. మరి కొందరిలో అయోర్టిక్ డిసెక్షన్ (బృహద్ధమని గోడల్లో చీలికవచ్చి అది మూసుకుపోవడం) పల్మోనరీ ఎంబోలిజమ్ ( ఊపిరితిత్తుల ధమనుల్లో రక్తం గడ్డలు ఎర్పడి, ఊపిరితిత్తులకి రక్త సరఫరా తగ్గిపోవడం) వంటి ఇతర ప్రాణాపాయ సమస్యలు ఉంటాయి.
కాని, అధిక శాతం మందిలో కండరాలు, ఎముకలకు సంబంధించిన, కడుపుకు సంబంధించిన (ముఖ్యంగా ఎసిడిటి) లేదా మానసికపరమైన కారణాలే ఉంటాయి.
గుండెపోటు వల్ల కలుగు ఛాతినొప్పి సాధారణంగా ఛాతి మధ్యభాగంలో లేదా కొంచెం ఎడమ భాగంలో ఉంటుంది. మరియు ఎడమ భుజము, చెయ్యి, మెడ, దవడలకు పాకవచ్చు. కొన్నిసార్లు ఉదరం పైభాగంలో ఉండవచ్చు. అప్పుడప్పుడు ఈ నొప్పి ఛాతి కుడిభాగంలో లేదా వీపులో కూడా వుండవచ్చు. ఈ నొప్పి మంటలాగా, పట్టినట్టుగా, బరువు పెట్టినట్టుగా లేదా పిండినట్టుగా అనిపిస్తుంది. ఈ నొప్పి వ్యక్తి స్పందనని బట్టి మరియు ఎంత గుండె కండరము దెబ్బతిన్నది అను దానిని బట్టి స్వల్పం నుంచి అతి తీవ్రం వరకు ఎంతగానైనా ఉండవచ్చు. మరియు గుండె మీద ఒత్తిడి పెంచే పనులను చేస్తే పెరగడం, విశ్రమంతో కొంత తగ్గడం ఉండొచ్చు.
తక్కువ మోతాదు గుండెపోటులో (UAINSTEMI) నొప్పి నెమ్మదిగా మొదలై చాలా నిమిషాల తరువాతనే తీవ్రస్థాయికి చేరవచ్చు లేదా పెరుగుతూ తరుగుతూ కూడా ఉండవచ్చు. తీవ్రమైన లేదా మేజర్ గుండెపోటులో సాధారణంగా నొప్పి హఠాత్తుగా మొదలై నిరవధికంగా, ఒకే స్థాయిలో 30 నిమిషాల పైగా ఉంటుంది
గుండెపోటు వచ్చిన వారికి ఛాతి నొప్పి కాక ఆయాసము, అధికంగా చెమటలు పట్టడం, వాంతులు కావడం, గుండెదడ,
నిస్సత్తువగా అనిపించడం, తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం, మిక్కిలి భయభ్రాంతులు కావడం వంటి ఇతర లక్షణాలు కూడా వుండవచ్చు.
గుండెపోటు వచ్చిన వారిలో 20% మందికి, ముఖ్యంగా ముసలివాళ్ళు, స్త్రీలు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. దీనినే నిశ్శబ్ద గుండెపోటు (Silent Heart attack) అంటారు. గుండెపోటు వల్ల కాక ఇతర కారణాల వల్ల వచ్చే ఛాతినొప్పి యొక్క కొన్ని లక్షణాలు.
- చూపుడు వేలుతో చూపించగలుగునట్టు, ఒకే చిన్న ప్రాంతంలో ముఖ్యంగా ఎడమవైపు బయటి భాగంలో నొప్పి రావటం.
- పదునైన వస్తువుతో గుచ్చినట్లు, సూదితో పొడిచినట్లు వచ్చే నొప్పి
- మధ్య లేదా క్రింది ఉదర భాగంలో ప్రథమంగా వచ్చే నొప్పి
- కదలికల వల్ల లేదా ఛాతి లేదా చేతులమీద వత్తిడితో ఎక్కువ అవడం.
- నొప్పి ఒకే తీవ్రస్థాయిలో చాలా గంటల పాటు ఉండటం.
- చాలా తాత్కాలికంగా ( కొద్ది క్షణాలు మాత్రమే) ఉండే నొప్పి,
- కాళ్ళకి కూడా పాకడం మొదలగునవి.
గుండెపోటు వచ్చిన వారిలో కొందరికి, ముఖ్యంగా ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, మధుమేహ వ్యాధిగ్రస్తులకి అసహజమైన లక్షణాలు ఉండవచ్చు. ఏ ఒక్క విషయం ద్వారా కూడా గుండె జబ్బును పూర్తిగా త్రోసిపుచ్చలేము. అందుచేత, అనుమానము ఉన్నప్పుడు తక్షణమే గుండె వ్యాధి నిపుణులను సంప్రదించడం తప్పనిసరి.