గుండెపోటు వచ్చిన వారు అయిన లేదా ఆంజియోప్లాస్టి (స్టెంట్ అమర్చిన వారు) లేదా బైపాస్ ఆపరేషన్
చేయించుకున్నవారు తిరిగి ఆరోగ్యంగా ఉండడం కోరకు మరియు ఆనంద కరమైన జీవితం గడపడానికి మరియు
ముందుముందు మళ్ళీ గుండె సమస్యల రాకుండా ఉండడానికి కొన్ని నియమాలు పాటించవలెను. అవి:
1) మందులు సక్రమంగా వేసుకోవడం:
గుండె జబ్బు ఉండేవారికైనా లేదా గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు అయిన మందులు వాడడము చాలా అవసరం.
ఇవి రక్తం పలుచపడడానికి, కొలస్ట్రాల్ తగ్గడానికి, గుండె మీద ఒత్తిడి తగ్గడానికి, గుండె నొప్పి మరియు ఆయాసం
తగ్గడానికి డాక్టర్ రాసిన ముఖ్యమైన మందులు. వీటిని మీ డాక్టర్ని సంప్రదించకుండా మానరాదు.
2) వ్యాయామం:
సాధారణంగా గుండెపోటు తరువాత గాని గుండె ఆపరేషన్ తరువాత కాని వీలు అయినంత త్వరగా శారీరక శ్రమ లేదా
వ్యాయామం మొదలు పెట్టాలి, కాని ఆనారోగ్యంగా ఉన్నవారు లేదా గుండె నొప్పి, ఆయాసంతో బాధపడుతున్న వారు
వ్యాయామాలు చేయరాదు.
సాధారణంగా నడవడము, త్వరగా నడవడము, సైకిల్ తొక్కడము, ఈత కొట్టడం వంటి వ్యాయామాలు సరైనవి. (ఈత
కొట్టడము రెండు నెలలు లోపు చేయకూడదు).
ఆటల పోటీలు, సంగీతానికి తగ్గట్టుగా వ్యాయామాలు చేయరాదు.
వ్యాయామం చేసేముందు పదినిమిషాలు వార్మప్ (warm up) అవ్వాలి మరియు వ్యాయామం చేసిన తరువాత 10 లేదా
15 నిమిషాలు కూల్ డౌన్ (Cooldown) అవ్వాలి. వ్యాయామాలు ఎంతవరకు సులువుగా చేయగలరో అంతవరకే చేస్తూ
నిధానంగా పెంచుకుంటూ పోవలెను. (ఎప్పుడు మితిమీరి వ్యాయామాలు చేయకూడదు) వ్యాయామాలు చేసేటప్పుడు
ఏదైనా చాతినొప్పి, ఆయాసము, గుండె, దడ, కళ్లు తిరగడం, ఎక్కువగా చమట పట్టడము లాంటి లక్షణాలు కనబడితే
వెంటనే వ్యాయామం ఆపేసి డాక్టర్ని సంప్రదించవలెను.
3) ఆహారం:
మనకు ఆహారము అవసరమైనంత విటమిన్స్, మినరల్స్, యాంటి ఆక్సిడెంట్స్ మరియు పీచు పదార్థము
అందించవలెను. అందుకు కాను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలిష్ చేయని ధాన్యాలు, కొవ్వు
తీసేసిన పాల ఉత్పత్తులు, కొడిగుడ్లు, చేపలు మరియు చర్మం లేని కోడి మాంసం తీసుకోవచ్చును.
అధికంగా కొవ్వు పదార్థాలు, అధికంగా పిండి పదార్థాలు, అధికంగా శక్తి (కేలరీస్) ఉండే ఆహారాలు, ఉప్పు ఎక్కువగా
ఉండే ఆహారాలు, కూల్ డ్రింక్స్, Processed ఆహారాలు (చిప్స్, బిస్కెట్స్,
చాక్లెట్స్ మొదలైనవి). ఆనారోగ్యమైన కొవ్వు పదార్ధాలు (సాచురేడెట్ కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు). ఉండే ఆహార పదార్థాలు మరియు చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు వీలు అయిన అంత వరకు నివారించవలెను.
4) అలవాట్లు:
పొగాకు వాడకము చాలా హానికరము దానిని పూర్తిగా మానివేయడం చాలా మంచిది. మద్యం సేవించడము మానివేస్తే
మంచిది. మితంగా మద్యం సేవించడం గురించి మీ డాక్టర్ తో సంప్రదించి నిర్ణయించుకొనవలెను.
5) బరువు తగ్గడం:
బరువు అధికంగా ఉండేవారు, బరువు తగ్గగలిగితే గుండెపోటు మరియు పక్షావతం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
BMI 25 గాని అంతకన్న తక్కువకిగాని తీసుకొని రాగితిలే ఉత్తమము కాని 5 నుండి 10 శాతం బరువు తగ్గినా దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
6) మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం:
అధికంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, కోపము వంటివి ఉంటే గుండె సమస్యలు కూడా అధికంగా వస్తాయి. కాబట్టి
యోగా, ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్, మొదలగునవి పాటించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవలెను.
7) విశ్రాంతి:
మనకు సరిపడా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. రోజుకి 7 నుండి 8 గంటలు దాకా సుఖంగా నిద్రపోవడం
ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.
8) ఇతర ఆరోగ్య సమస్యలు:
గుండెజబ్బు ఉన్నవారు షుగరు వ్యాధి, బీబీ, థైరాయిడ్ సమస్యలు, అధిక కొలస్ట్రాల్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు
కూడా నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.
సాధించవలసిన లక్ష్యాలు:
FBS<130mg%, PLBS<180mg% HbA1c<7%
BP< 130/80mm Hg
LDL<70mg%., TG<150mg%
9) బండి నడపడము:
ఆంజియోగ్రామ్ లేదా ఆంజియోప్లాస్టి (గుండెపోటు రాని వారికి) తరువాత రెండు రోజుల వ్యవధి తరువాతనే బండి
నడుపుకోవచ్చు.
గుండెపోటు వచ్చి కోలుకున్న వారు (ఆంజియోప్లాస్టి అయిన వారితో సహా) రెండు వారులు తరువాత బండి
నడుపుకోవచ్చు. ఆయాసము, కాళ్ళ వాపులు లాంటి హార్ట్ ఫైల్యూర్ (గుండె సోలిపోవడం) లక్షణాలు ఉన్నవారు గాని లేదా
బైపాస్ ఆపరేషన్ అయిన వారు గాని కనీసము నెల రోజుల తరువాతనే బండి నడుపుకోవచ్చును. కమర్షియల్
వాహనాలు(లారీ, టిప్పర్, JCB, క్రేన్, బస్సు) వంటివి నడిపేవారు వాటికి సంబంధిత అధికారిక నియమాలు పాటించి
కొన్ని ఎక్కువ రోజులు ఆగవలసి ఉంటుంది.
10) ప్రయాణం చేయడం:
గుండెపోటు లేదా ఆంజియోప్లాస్టి లేదా బైపాస్ సర్జరీ తరువాత Discharge అయిన వెంటనే, ఆ వ్యక్తి కారులో కాని,
బస్సులో కాని, రైలులోకాని ప్రయాణించడానికి ఎటువంటి సమస్య ఉండదు.
కాని విమాన ప్రయాణం చేసే ముందు, మీ డాక్టరును సంప్రదించవలెను.
11) దాంపత్య జీవితం:
చాలా మంది వ్యక్తులు గుండెపోటు తరువాత ఒక్కటి నుంచి రెండు వారాల తరువాత 5 నుంచి 6 METS అంత శారీరక
శ్రమ (మితమైన తీవ్రత) చేయగలిగిన వారు ఇబ్బంది పడకుండా దాంపత్య జీవితాన్ని కొనసాగించగలరు.
12) క్రమమైన ఆరోగ్య పరీక్షలు:
గుండెపోటు లేదా ఆంజియోప్లాస్టి లేదా బైపాస్ ఆపరేషన్ అయిన వారు డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా పరీక్షలు
చేయించుకోవడం, మందులు వేసుకోవడం మరియు సలహాలు పాటించడం చాలా అవసరం. ఎటువంటి లక్షణాలు
(ఛాతి నొప్పి, బరువుగా అనిపించడం, ఆయాసం మొదలగునవి). కనిపించినా వాటి ప్రాముఖ్యత తెలుసుకోవడానికి
మరియు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి నిస్సంకోచంగా మీ డాక్టర్ ని సంప్రదించి అతని సలహాలు
పాటించవలెను.