కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు పదార్థము. ఇది మన శరీరంలోని ప్రతి కణంలోను ఉంటుంది
మరియు హార్మోన్లు, పైత్య ఆమ్లాలు, విటమిన్ డి వంటి వాటి తయారీకి తోడ్పడుతుంది.

కొలెస్ట్రాల్ మనకు ఎలా లభ్యమవుతుంది?

ఇది మనకు పాలు,  పాల ఉత్పత్తులు మరియు మాంసాహారము ద్వారా లభిస్తుంది మరియు మన
కాలేయములో కూడా ఉత్పత్తి అవుతుంది.

కొలెస్ట్రాల్ ఎన్ని రకములు? అవి ఏమిటి?

కొలెస్ట్రాల్ నీటిలో లేదా రక్తంలో కరగదు. కావున ఇది కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్లతో చేరి రకరకాల
లైపోప్రొటీన్లుగా రక్త ప్రవాహంలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి రెండు రకములు :

1. చెడు కొలెస్ట్రాల్ :
తక్కువ సాంద్రత కలిగిన లైపోప్రొటీన్లు (Low density lipo-proteins, LDL cholestrol) నే వాడుకలో
చెడు కొలెస్ట్రాల్ అంటాము. ఇవి రక్తనాళాలకు మరియు అన్ని అవయవాలకు కొలెస్ట్రాల్ ను తరలించి
వాటిలో కొలెస్ట్రాల్ కొవ్వు పేరుకునేలా చేస్తాయి.

2. మంచి కొలెస్ట్రాల్ :
అధిక సాంద్రత కలిగిన లైపోప్రొటీన్లు (High density lipo-proteins, HDL cholestrol)నే మనం
వాడుకలో మంచి కొలెస్ట్రాల్ అంటాము. ఇది రక్తనాళాలు మరియు ఇతర అవయవాల నుంచి కొలెస్ట్రాల్ కొవ్వుని తొలగించి దానిని కాలేయానికి చేర్చి తద్వారా శరీరం నుంచి తొలగించడానికి తోడ్పడుతుంది.

కొలెస్ట్రాల్ వల్ల ప్రమాదం ఏమిటీ?

చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలో అధికంగా ఉంటే, అది రక్తనాళాల (ప్రత్యేకించి ధమనుల) గోడల్లో పేరుకుని ధమన కాఠిన్య ఫలకాలుగా (Atherosclerosis) ఏర్పడి ఆ ధమనులను సన్నబడేట్టు చేస్తుంది. కొన్ని సార్లు ఈ ఫలకాలు చిట్లి వాటి మీద రక్తం గడ్డ కట్టి ధమనులు పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇలా ఏ అవయవానికి సంబంధించిన ధమనుల్లో అవుతుందో దాన్ని బట్టి గుండెపోటు, పక్షవాతం, కాళ్ళు లేదా చేతుల గాంగ్రీన్, కంటి చూపు పోవడం, మూత్రపిండాలు పాడవడం వంటి ప్రమాదాలకు దారి తీస్తుంది.

ట్రైగ్లిసరైడ్స్ అంటే ఏమిటి? దాని వల్ల ప్రమాదం ఏమిటి?

ట్రైగ్లిసరైడ్స్ అనేది శాకాహారంలో కూడా ఉండే ఇంకొక రకమైన కొవ్వు పదార్థము ఇది రక్తంలో అధికంగా ఉంటే, దీని వల్ల కూడా గుండె జబ్బు రావడానికి కొంత అవకాశం ఉంటుంది మరియు మరీ అధికంగా ఉంటే దీని వల్ల క్లోమశోధము (Pancreatitis)రావడానికి అవకాశము ఉంటుంది.

కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ మన రక్తంలో ఎంత వరకు ఉండవచ్చు?

చెడు కొలెస్ట్రాల్ : ఇది 100 mg/dl కన్నా తక్కువ ఉండాలి. గుండె జబ్బు లేదా షుగరు వ్యాధి లేదా అధిక ప్రమాదం ఉన్నవారికి 70 mg/dl కన్నా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.

మంచి కొలెస్ట్రాల్ : ఇది మగవారిలో కనీసం 40 mg/dl కన్నా మరియు ఆడవారిలో 50 mg/dl కన్నా ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.
ట్రైగ్లిసరైడ్స్ : ఇది 150 mg/dl కన్నా తక్కువ ఉండాలి.

కొలెస్ట్రాల్ ని తగ్గించుకునే మార్గం ఏమిటి?

తినకూడనివి : శాచురేటెడ్ కొవ్వు, ట్రాన్స్ కొవ్వు మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే  పదార్థాలు అనగా : డాల్డా, వనస్పతి నెయ్యి, కొబ్బరి నూనె, పామాయిల్ మరియు పై వాటిలో వేయించిన చిరుతిండ్లు, ఫ్రెంచ్ ప్రెస్, ఫ్రైడ్ చికెన్ ఉల్లగడ్డ చిప్స్, బటూర, పరోట, పూరి మొ||నవి మరియు వాటితో తయారు చేసే ఉత్పత్తులు : బిస్కెట్లు , కుకీస్, డోనట్స్,కేకులు వంటివి, ఇన్ స్టెంట్ నూడిల్స్, ఘనీ భవించిన ఆహారాలు (Frozen Foods) కొవ్వుతో కూడిన కోడిమాంసం, కోడిగుడ్డులోని పచ్చ సొన, సంపూర్ణ (కొవ్వు తీయని) పాలు మరియు పాల ఉత్పత్తులు (వెన్న, నెయ్యి, మీగడ, ఐస్ క్రీమ్స్ లు) మొ||నవి.

తినదగినవి : కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, తృణధాన్యాలు (Whole Grains) కొవ్వు
పాలు మరియు పాల ఉత్పత్తులు, చేపలు, కోడిగుడ్డులోని తెల్లసొన, చర్మం తీసేసిన కోడిమాంసం, అన్‌సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే వెజిటెబుల్ నూనెలు ముఖ్యంగా నట్స్, ఆలివ్స్ వంటివి.

చేయవలసినవి: శారీరకంగా హుషారుగా ఉండడం మరియు రోజు వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ తగ్గడం, మంచి కొలెస్ట్రాల్ పెరగడమే కాక, బరువు తగ్గడానికి, రక్తపోటు తగ్గడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి దోహదపడి తద్వారా ఎన్నో విధాలుగా గుండె జబ్బు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు ఉండవలెను. బరువు అధికంగా ఉంటే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ పెరగడము, మంచి కొలెస్ట్రాల్ తగ్గడమే కాక మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉంది.

మందులు : కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ ను నియంత్రించేందుకు ఎన్నో రకాల మందులు కూడా ఉన్నాయి.అవసరాన్ని బట్టి వైద్యుల సలహా మేరకు వాటిని కూడా తీసుకోవలసి రావచ్చు
గుండెపోటు మరియు అనేక ఇతర సమస్యలకు కారణమైన ఈ కొలెస్ట్రాల్ ని నియంత్రించుకొని తద్వారా మంచిఆరోగ్యానికి, గుండె స్వస్థతకు ఇంకొంచెం చేరువ కాగలరని ఆశిస్తున్నాను.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *